విస్తరాకులు మనం పూర్తిగా మర్చిపోయాం.. విదేశాల్లో ఇప్పుడు ఫుల్ గిరాకీ

మీ టూత్ పేస్టులో ఉప్పుందా..? అసలు బొగ్గుందా..? అంటూ ఓ స్టార్ మైకు పట్టుకుని టీవీలో హఠాత్తుగా ప్రత్యక్షమై అడుగుతుంది… పేస్టులో ఏముందో నాకేం తెలుసు..? అని ప్రశ్న అడగబడిన అబ్బాయో, అమ్మాయో తెల్లమొహం వేస్తారు… అంటే పళ్లు తోముకునే విషయంలో ఉప్పు, బొగ్గు అత్యంత శ్రేయస్కరమని సదరు కోల్ గేట్ అనబడేవాడికి ఇన్నేండ్లకు తెలిసింది… ఇన్నేండ్లుగా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేశాక.. కొన్ని శతాబ్దాలపాటు భారతీయులు పాపం, బొగ్గు పొడితో, ఉప్పుతోనే పళ్లు తోముకునేవారని ఆ టూత్ పేస్ట్ కంపెనీ చెప్పదు… ఇప్పటి తరాలకు తెలియదు… తెల్లవారి లేవగానే పేస్టు పేరిట కొన్ని కెమికల్స్ ను నోటిలో కుమ్మేసుకోవడమే… నిజానికి పళ్లు తోమటానికి బ్రష్ ముఖ్యం… అంతే ఇంకేదీ అక్కర్లేదు… పళ్ల నడుమ ఇరుక్కున్న అవశేషాలను తొలగించడం, పాచి పోయేలా కాస్త పళ్లపై రుద్దడం… అంతే… ఆ పని గతంలో వేపపుల్లలు చేసేవి… సరే, ఏమయితేనేం..? టూత్ పేస్టులకన్నా బొగ్గుపొడి మేలు ఇలలో సుమతీ అని మళ్లీ మనల్ని మన పాత రోజులే బెటర్ అని చెబుతున్నట్టే కదా… 

అచ్చం ఇలాగే… ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ విస్తళ్లు అంటే ప్లేట్లు, ప్లాస్టిక్ చెంచాలు, ప్లాస్టిక్ గ్లాసులు… అవేమో డిగ్రేడబుల్ కాదు, నేలలో కలిసిపోవు.,.. అందుకే ఇప్పుడు యూరోపియన్ దేశాలు మళ్లీ మన రోజుల్లోకి వస్తున్నాయి.. భారతీయుల పాత రోజుల్లోకి ఇప్పటి యూరోపియన్లు వచ్చేస్తున్నారు… ప్రశాంత, ఆరోగ్య జీవనానికి యోగాను గుర్తించినట్టే…. మన విస్తళ్లకూ మంచి రోజులొచ్చాయి…

ఈ ప్లాస్టిక్ భూతం చాలా దేశాలను వణికిస్తున్నది… పైగా ప్లాస్టిక్ పాత్రల్లో వేడి వేడి ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యాన్నీ నాశనం చేస్తున్నది… అది గుర్తించిన ఓ కంపెనీ… పేరు లీఫ్ రిపబ్లిక్… పేరులోనే ఆకును పెట్టుకున్నాడు చూశారా..? విస్తళ్లకు ఉపయోగపడే ఆకులు ఎక్కడెక్కడ దొరుకుతాయో అన్వేషించి, స్థానిక వర్కింగ్ గ్రూపులతో ఒప్పందాలు కుదుర్చుకుని, విస్తళ్లు కుట్టిస్తున్నారు… ఇప్పడవి జర్మనీ తదితర దేశాల్లో విపరీతంగా పాపులర్ అయిపోతున్నాయి…

ఆసియా, దక్షిణ అమెరికా అడవుల నుంచి ఎక్కువగా తెప్పిస్తున్నారు… మన దేశానికి సంబంధించి మొదట ఒరిస్సాలో గిరిజన డ్వాక్రా గ్రూపులతో మొదలైన ఈ వ్యాపారం చత్తీస్ గఢ్ కూ పాకింది… ఏపీలోనూ అవకాశాలున్నాయి కానీ ఇంకా ఎందుకో స్టార్ట్ కానట్టుంది… ఇంతకుముందు రోజంతా విస్తళ్లు కుట్టినా సరే నెలకు 300 లేదా 400 రూపాయలు కూడా రాని కూలీలు ఇప్పుడు 3000 దాకా సంపాదించుకుంటున్నారు… ఈ జర్మన్ కంపెనీ ఇంకొన్నిచోట్ల ఏం చేస్తున్నదంటే విస్తళ్లకు బదులు చాపల్లాగా కుట్టించుకుని తెప్పించుకుంటున్నది… జర్మనీలోనే మూడు పొరలుగా పేర్చి, మిషన్ ప్రెస్ చేసి, హై క్వాలిటీ ప్లేట్లను చేయించుకుంటున్నారు… ధర ఎక్కువ అయినా సరే చాలా మంది వీటిని ఇష్టపడుతున్నారు… కొన్ని పెద్ద పెద్ద హోటళ్లలోనూ వాడుతున్నారు… మనం మాత్రం విస్తళ్లలో తినడాన్ని నామోషీగా భావిస్తున్నాం ఇప్పటికీ…

ప్లాస్టిక్ ప్లేటు నేలలో కలిసిపోవటానికి 450 ఏళ్లు పడితే, విస్తరి అంటే ఈ పత్రపళ్లెం (అనగా లీఫ్ ప్లేట్) నేలలో కలిసిపోవటానికి కేవలం నెల రోజులు చాలు… అర్థమైంది కదా… అదీ విస్తరి విలువ…
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)