ఇంకా పెళ్లి కాలేదు కానీ ఒక గుండెజబ్బు ఉన్న పిల్లాడిని దత్తత తీసుకున్నాడు మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించాడు ఈ 28 ఏళ్ళ సాఫ్ట్ వేర్ ఇంజనీర్

ఆదిత్య తివారి, పూణే లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు తన వయసు 28 ఏళ్ళు. 2014 లో తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఇండోర్ లో మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థ నడిపే ఒక అనాధాశ్రమానికి వెళ్ళాడు. అక్కడి పిల్లలకు ఏవో చిన్న గిఫ్ట్స్ తీసుకెళ్ళి పంచిపెట్టాడు. అలా పిల్లలకి గిఫ్ట్స్ పంచుతున్న ఆదిత్య దృష్టి, అక్కడున్న బిన్నీ అనే బాబు పై పడింది. అందరు పిల్లలు హుషారుగా ఆడుకుంటుంటే, ఏడాది లోపు వయసున్న బిన్నీ మాత్రం మంచం పై ఆచేతనంగా పడిఉన్నాడు. బిన్నీ దగ్గరకు వెళ్ళిన ఆదిత్యకు ఆ బాబుపై ఏదో ప్రత్యేక అభిమానం కలిగింది. ఆ బాబు కి డౌన్ సిండ్రోం అనే జబ్బు ఉందని, గుండెకి చిల్లు కూడా ఉందని అతని తల్లిదండ్రులు అనాధాశ్రమంలో వదిలేసి వెళ్ళారు. ఆదిత్య బిన్నీని పలకరించే ప్రయత్నం చేస్తే, ఆ బాబు ఆదిత్య వేలు గట్టిగా పట్టుకున్నాడు. పిల్లలు ఆడుకునేటప్పుడు అలా వేళ్ళు పట్టుకోవడం సహజం అనుకున్న ఆదిత్య అక్కడినుండి వచ్చేసాడు.

ఒక నెల తర్వాత మళ్ళీ అదే అనాధాశ్రమానికి ఆదిత్య వెళ్ళాడు. అప్పటికే అక్కడ అంతకు ముందు ఉన్న చాలామంది పిల్లలని, సంతానం లేని దంపతులు దత్తత తీసుకుని వెళ్ళారు. బిన్నీ కి మాత్రం గుండె జబ్బు ఉందనే కారణంతో దత్తత తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. ఆ క్షణాన బిన్నీని దత్తత తీసుకోవాలని ఆదిత్య నిర్ణయించుకున్నాడు. అయితే, అప్పటికింకా పెళ్ళే కాని తమ కొడుకు, ఒక పిల్లాడిని దత్తత తీసుకుని ఆ పిల్లాడికి తండ్రి అవుతానంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు. ఆదిత్య తల్లిదండ్రులు కూడా అంతే. “ఇప్పుడు ఆ పిల్లాడిని దత్తత తీసుకుంటే, నీకు పెళ్లెలా అవుతుందిరా”, అని ఆదిత్య నిర్ణయాన్ని వ్యతిరేకించారు. చాలా కష్టపడి, బిన్నీని దత్తత తీసుకునే విషయం లో తన తల్లిదండ్రులను ఆదిత్య కన్విన్స్ చేసాడు. ఆ తర్వాత, ఆదిత్య కు అసలు కష్టాలు మొదలయ్యాయి.
ఆదిత్య కోసం రూల్స్ మార్చిన కేంద్ర ప్రభుత్వం, అయినా..

పెళ్ళే కాని ఆదిత్యకు బిన్నీని దత్తత ఇవ్వడానికి అనాధాశ్రమం నిర్వాహకులు ఒప్పుకోలేదు. సింగిల్ పేరెంట్ కి దత్తత ఇవ్వడానికి తమ రూల్స్ ఒప్పుకోవని ఆదిత్యకు తేల్చి చెప్పారు. అనాధాశ్రమం నిర్వహిస్తున్న సిస్టర్స్ కు నచ్చచెప్పేందుకు కొన్ని నెలల పాటు వారి చుట్టూ తిరిగాడు. ఆఖరికి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ను సంప్రదించాడు. ఆ శాఖ మంత్రి మనేకా గాంధీ ( మేనక కాదు, ఆమె పేరు ఇంగ్లీష్ లో maneka అని రాస్తారు.) కి దాదాపు 100 ఈ మెయిల్స్ పంపాడు. ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా మెయిల్స్ పంపాడు. మంత్రి మనేకా గాంధీ, ఆదిత్యకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. భోపాల్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తో మాట్లాడి, బిన్నీ దత్తత వ్యవహారం చూడాల్సిందిగా “దత్తత వ్యవహారాలు చూసే కేంద్ర అథారిటీ” వారిని మంత్రి మనేకా గాంధీ ఆదేశించారు. ఆదిత్య ఫిర్యాదుల తర్వాత బిన్నీని ఇండోర్ అనాధాశ్రమం నుండి భోపాల్ లోని మాతృఛాయ అనే సంస్థకి పంపించారు. ఆ సంస్థ వాళ్ళు కూడా ఆదిత్యకు బిన్నీని దత్తత ఇవ్వడానికి ఒప్పుకోలేదు. మనేకా గాంధీ స్వయంగా భోపాల్ మాతృఛాయ సంస్థని సందర్శించి బిన్నీని ఆదిత్యకు దత్తత ఇవ్వాలని ఆదేశించినా వాళ్ళు పట్టించుకోలేదు. పెళ్ళికాని వారు ఎవరైనా పిల్లలని దత్తత తీసుకోవాలి అంటే, వారి వయసు కనీసం 30 సంవత్సరాలు ఉండాలని రూల్ ఉంది. ఆదిత్య వయసేమో 28, కాబట్టి దత్తత ఇవ్వడం కుదరదు అనేది మాతృఛాయ సంస్థవారి వాదన. ఆదిత్య పట్టుదల మంచితనం చూసిన కేంద్ర ప్రభుత్వం, ఈ వయసును 25 ఏళ్లకు తగ్గిస్తూ ఆగస్ట్ 2015 లో నిర్ణయం తీసుకుంది. సవరించిన రూల్స్ ప్రకారం ఆదిత్యకు బిన్నీని దత్తత తీసుకునే అర్హత వచ్చినా మాతృఛాయ సంస్థవారు, దత్తతకి అంగీకరించలేదు.

పట్టువదలని ఆదిత్య మళ్ళీ ప్రధాని కార్యాలయానికి, మహిళా శిశు సంక్షేమ శాఖకి ఫిర్యాదు చేసాడు. ప్రధాని కార్యాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అంశాన్ని పరిష్కరించాలని కోరుతూ ఉత్తరం రావడం తో, రాష్ట్ర ప్రభుత్వం కదిలింది.

ప్రభుత్వం నుండి వత్తిడి పెరగడం తో ఆఖరికి, 2015 డిసెంబర్ లో మాతృఛాయ సంస్థ వాళ్ళు, బిన్నీని ఆదిత్యకు దత్తత ఇవ్వడానికి ఒప్పుకున్నారు. జనవరి లో వచ్చి బిన్నీని తీసుకెళ్ళమని ఆదిత్యకు కబురు పెట్టారు. ఆదిత్య వెళ్లి బిన్నీని దత్తత తీసుకున్నాడు. బిన్నీ పేరుని అన్విష్ తివారి గా మార్చాడు. గుండె కు రంధ్రం తో బాధపడుతున్న అన్విష్ ను మంచి డాక్టర్ కు చూపించాడు. ఇప్పుడప్పుడే ఆపరేషన్ అవసరం లేదని, మందులతో నయం చేసేందుకు ప్రయత్నిద్దామని ఆ డాక్టర్ చెప్పారు. అన్విష్ కు ఉన్న మరో జబ్బు, డౌన్స్ సిండ్రోం వ్యాధికి సరైన మందు లేదు. ఈవ్యాధి ఉన్న పిల్లలలో మానసిక ఎదుగుదల బాగా తక్కువ ఉంటుంది. అయితే, ఆదిత్య మాత్రం, నా కొడుకు కి ఉన్న జబ్బు గురించి నేను తెలుసుకుంటున్నా, తనని కని వదిలేసినవాళ్ళ లాగా నేను బాధపడుతూ కూర్చొను. ఎంత ఖరీదయినా వైద్యం చేయిస్తానని ఆదిత్య అంటున్నాడు. పిల్లలతో కలసి ఆడుకుంటుంటే అన్విష్ పరిస్థితి మెరుగుపడుతుందని డాక్టర్ చెప్పడం తో, అన్విష్ ను ఆదిత్య రోజూ తనతో ఆఫీసుకు తీసుకెళ్ళి, అక్కడ ఉన్న డే కేర్ సెంటర్ లో ఉంచుతున్నాడు. పిల్లలని దత్తత తీసుకునే వాళ్లకి ఆదిత్య ఆఫీసులో 150 రోజులు వేతనం తో కూడిన సెలవు ఇస్తారట. ఇప్పటికి అయితే, ఆ సెలవు అవసరం రాలేదు. అన్విష్ ను చూసుకోవడంలో నాకు రోజువారీ జీవితానికి ఎలాంటి ఇబ్బంది ఉండడం లేదని చెబుతున్నారు ఆదిత్య.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)