22 ఏళ్లుగా జీతం తీసుకోకుండా పాఠాలు చెబుతున్నాడు ఆ ఉపాధ్యాయుడు..!

Loading...
మ‌న దేశంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. సౌక‌ర్యాల విష‌యం ప‌క్క‌న పెడితే వాటిలో మంచి ఉపాధ్యాయులు ఉన్నా పాఠాలు స‌రిగ్గా చెప్ప‌రు. దీంతో చాలా మంది త‌ల్లిదండ్రులు త‌మ త‌మ పిల్ల‌లను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చేర్పించాలంటే వెనుక‌డుగు వేస్తుంటారు. అయితే ఇలాంటి ధోర‌ణి పోవాల‌ని, ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లోనూ నాణ్య‌మైన విద్య దొరుకుతుంద‌నే భావ‌న‌ను అంద‌రిలోనూ క‌లిగించాల‌ని కృషి చేస్తున్నాడు ఆ ఉపాధ్యాయుడు. టీచ‌ర్‌గా ఎప్పుడో ప్ర‌భుత్వ పాఠ‌శాల నుంచి రిటైర్ అయినా విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య అందించాల‌నే ఒకే ఉద్దేశంతో ఆయ‌న ఇప్ప‌టికీ ప‌నిచేస్తున్నాడు. అలా ప‌నిచేస్తున్నందుకు అత‌ను గత 22 ఏళ్ల నుంచి ఎలాంటి జీతం కూడా తీసుకోవ‌డం లేదు. అత‌నే… శ్రీ‌కృష్ణ శ‌ర్మ‌..!

శ్రీకృష్ణ శ‌ర్మ 1954 మే నెల‌లో ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని షాజ‌హాన్‌పూర్ కాంత్ బ్లాక్‌లో ఉన్న ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌కు ఉపాధ్యాయుడిగా నియామ‌కం అయ్యాడు. అప్ప‌టి నుంచి 1995 జూన్ 30 వ‌ర‌కు అదే పాఠ‌శాల‌లో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా సేవ‌లందించాడు. అయితే 1995లో ఆయ‌న ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైర్ అయ్యాడు. అయినా ఆ పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య అందించాల‌నే ఉద్దేశంతో అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అందులో ప‌నిచేస్తూనే ఉన్నాడు. అందుకు గాను శ‌ర్మ ఎలాంటి వేత‌నం కూడా తీసుకోవ‌డం లేదు.

సాధార‌ణంగా రిటైరైన ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎవ‌రైనా విశ్రాంతి తీసుకుంటారు. కానీ శ‌ర్మ అలా తీసుకోద‌ల‌చుకోలేదు. విద్యార్థుల‌ను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల‌ని భావించి అదే స్కూల్‌లో గ‌త 22 ఏళ్లుగా ఉచితంగా విద్య‌ను బోధిస్తున్నాడు. అయితే తాను రెగ్యుల‌ర్‌గా చెప్పే ఇంగ్లిష్ మాత్ర‌మే కాకుండా ఇత‌ర పాఠ్యాంశాల‌ను కూడా విద్యార్థుల‌కు అత‌ను బోధిస్తున్నాడు. ఎవ‌రైనా ఉపాధ్యాయుడు రాక‌పోతే ఆ క్లాస్ ఏదైనా స‌రే శ‌ర్మ తీసుకుంటాడు. ఆ క్లాస్‌లో విద్యార్థుల‌కు వ‌చ్చే సందేహాల‌ను నివృత్తి చేస్తుంటాడు. పాఠ‌శాల‌కు ఇత‌ర ఉపాధ్యాయులు మాత్రం ఒక్కోసారి గైర్హాజ‌రు అయ్యే వారు కానీ శ‌ర్మ మాత్రం అలా కాదు. అత్య‌వ‌స‌ర ప‌ని ఉంటే త‌ప్ప ఇప్ప‌టికీ పాఠ‌శాల‌కు హాజ‌ర‌వుతూనే ఉంటాడు. సెల‌వు అస్స‌లు తీసుకోడు. ఈ క్ర‌మంలో ఆయ‌న సేవ‌ను చూసి స్థానికులు ఎంత‌గానో అభినందిస్తున్నారు. అక్క‌డి ప్ర‌భుత్వం కూడా శ‌ర్మ‌ను గొప్ప‌గా స‌న్మానించాల‌ని భావిస్తోంది. అంతే క‌దా మ‌రి… ఏ పాఠ‌శాల‌లో అయినా శ‌ర్మ లాంటి ఉపాధ్యాయులు ఉండాల‌నే క‌దా ఎవ‌రైనా కోరుకునేది..!
Loading...

Popular Posts