స్కూల్స్ ద‌గ్గ‌ర‌ కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ అమ్మొద్దంటూ స్కూల్ పిల్ల‌ల ఆరోగ్యం కోసం అలుపెర‌గ‌ని న్యాయ‌పోరాటం చేసి గెలిచాడు.

Loading...
చిప్స్‌, ఫ్రైడ్ ఫుడ్స్‌, శీత‌ల పానీయాలు, రెడీ టు ఈట్ ఫుడ్స్‌, ఫాస్ట్ ఫుడ్స్‌, పిజ్జాలు, బ‌ర్గ‌ర్లు, బేక‌రీ ఐటమ్స్‌… ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మ‌న‌కు ల‌భ్య‌మ‌వుతున్న జంక్ ఫుడ్ లిస్ట్ చాంతాడంత అవుతుంది. అయితే జంక్ ఫుడ్ తింటే ఎలాంటి అనారోగ్యాలు వ‌స్తాయో మ‌న‌కు బాగా తెలుసు. కానీ పిల్ల‌ల‌కు తెలియ‌దు క‌దా. వారికి ఏ ఆహారం తినాలి, ఏది తిన‌కూడ‌దు అని చెప్పాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంటుంది. ఈ క్ర‌మంలో అలా చెప్ప‌క‌పోతుండ‌డం వ‌ల్ల పిల్లలు ఏం చేస్తున్నారంటే జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తింటున్నారు. అదీ రోజూ స్కూల్‌లోనే ఎక్కువ కావ‌డం గ‌మ‌నార్హం. కొంద‌రు పిల్లలైతే లంచ్ బాక్స్ పూర్తి చేయ‌రు, కానీ జంక్ ఫుడ్ తినేందుకే ఇష్ట ప‌డ‌తారు. అయితే ఇలా తిన‌డం వ‌ల్ల చిన్న‌త‌నంలోనే వారికి అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. దీన్ని గ‌మ‌నించిన ఓ వ్య‌క్తి స్కూల్స్‌లో జంక్ ఫుడ్ ఉండొద్ద‌ని చెబుతూ అంద‌రిలోనూ అవ‌గాహ‌న క‌లిగిస్తున్నాడు. అంతేకాదు, ఇదే విష‌యంపై ఎన్నో నెల‌లుగా హైకోర్ట్‌లో పోరాడి మ‌రీ ఎట్ట‌కేల‌కు విజ‌యం సాధించాడు. ఫ‌లితంగా స్కూల్స్‌లో జంక్ ఫుడ్ ఉండొద్ద‌ని, పోష‌కాహారం పిల్ల‌ల‌కు అందుబాటులో ఉంచాల‌ని, స్కూల్స్‌కు క‌నీసం 50 మీట‌ర్ల దూరంలోనే జంక్ ఫుడ్ విక్ర‌యించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఇది జ‌రిగింది ఢిల్లీలో..!

ఢిల్లీకి చెందిన రాహుల్ వ‌ర్మ కుమారుడు పుట్టుక‌తోనే ప‌లు కాంజెనిట‌ల్ డిజేబులిటీస్‌తో జ‌న్మించాడు. దీంతో అతన్ని ఎయిమ్స్ లో ఎప్ప‌టిక‌ప్పుడు చెక‌ప్ కోసం తీసుకువ‌చ్చేవాడు. అయితే అక్క‌డ ఒక‌సారి భారీ కాయం క‌లిగిన ఓ బాలిక‌ను చూశాడు. వ‌య‌స్సు చూస్తే చాలా త‌క్కువ‌గా ఉంది, అయినా శ‌రీరం మాత్రం విప‌రీతంగా పెరిగిపోయింది. ఎందుకా అని వాక‌బు చేస్తే ఆ బాలిక జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తింటుంద‌ని, అందుకే ఆమె శ‌రీరం అంత‌గా పెరిగింద‌ని తెలిసింది. అక్క‌డికి ఆమె ఎందుకు వ‌చ్చిందంటే బాగా జంక్ ఫుడ్ తింటుండ‌డంతో క‌డుపులో మంట వ‌చ్చి అసిడిటీ పెరిగింద‌ట‌. దీంతో ఆస్ప‌త్రికి ట్రీట్‌మెంట్ కోసం వ‌చ్చిందని రాహుల్ తెలుసుకున్నాడు. అయితే ఆమె అలా అవ‌స్థ ప‌డుతుండ‌డం చూసి రాహుల్ వెంట‌నే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చాడు. అనుకున్న‌దే త‌డ‌వుగా త‌న నిర్ణ‌యాన్ని అమ‌లులో పెట్టాడు.

త‌న కుమారుడు ఉద‌య్ పేరిట ఉద‌య్ ఫౌండేష‌న్ అనే ఓ స్వ‌చ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాడు. కానీ దాన్ని న‌డిపేందుకు రాహుల్ వ‌ద్ద త‌గినంత డ‌బ్బు లేదు. అయినా దిగులు చెంద‌లేదు. ఎలాగోలా త‌న నిర్ణ‌యాన్ని అమ‌లులో పెట్టేశాడు. స్కూళ్లలో జంక్ ఫుడ్ అమ్మ‌వ‌ద్ద‌ని కోరతూ ఢిల్లీ హై కోర్టులో పిల్ దాఖ‌లు చేశాడు. అయితే మొద‌ట అత‌ని త‌ర‌ఫు లాయ‌ర్ కేసును మ‌ధ్య‌లోనే వ‌దిలేశాడు. దీంతో అత‌ను వేరే లాయ‌ర్‌ను వెతుక్కోవాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో జంక్ ఫుడ్‌, దాని వ‌ల్ల క‌లిగే అన‌ర్థాలు తదిత‌ర స‌మాచారాన్ని సేక‌రించ‌డం కోసం రాహుల్‌కు చాలా స‌మ‌యం ప‌ట్టింది. అలా అత‌ను ఎన్నో ప‌రిశోధ‌న ప‌త్రాలు, జ‌ర్న‌ల్స్‌ను సేక‌రించి వాటిని కోర్టు ముందుంచాడు. అందుకు గాను అత‌నికి 52 నెల‌ల స‌మ‌యం ప‌ట్టింది. అయినా ఎట్ట‌కేల‌కు ఢిల్లీ హైకోర్టు రాహుల్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఢిల్లీలోని ఏ పాఠ‌శాల‌లోనూ జంక్ ఫుడ్ విక్ర‌యించ‌వ‌ద్ద‌ని, వాటిని స్కూల్‌కు 50 మీట‌ర్ల అవ‌త‌ల విక్ర‌యించాల‌ని ఆదేశించింది. అంతేకాదు, పిల్లలు రీసెస్ టైంలో తినేందుకు వారికి ఫ్రూట్స్‌, స‌లాడ్స్‌, పాలు, మిల్క్ షేక్స్‌, వెజిట‌బుల్స్ వంటి పౌష్టికాహారాన్ని అందుబాటులో ఉంచాల‌ని చెప్పింది. దీంతో రాహుల్ ఎంత‌గానో సంతృప్తి చెందాడు. అయితే రాహుల్ ఓ వైపు కోర్టుకు హాజ‌ర‌వుతూనే మ‌రో వైపు జంక్ ఫుడ్ ప‌ట్ల అక్క‌డి అన్ని స్కూళ్ల‌లోనూ పిల్ల‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌సాగాడు. కొంత మంది విద్యార్థులు, టీచర్ల స‌హాయంతో అత‌ను ఆ ప‌నికి పూనుకున్నాడు. అయితే తీర్పు వ‌చ్చినా ఇప్ప‌టికీ రాహుల్ త‌న అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను మాత్రం మాన‌లేదు. జంక్ ఫుడ్ ప‌ట్ల వీలైనంత మందికి అవ‌గాహ‌న క‌ల్పిస్తాన‌ని చెబుతున్నాడు. అత‌ని ప్ర‌య‌త్నానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!
Loading...

Popular Posts