ప్రాణాలు పోతున్నా..ఇంత మానవత్వమా.. రోడ్డుపై వెళ్లేవారిని దగ్గరకు పిలిచి తన అవయవాల్లో ఏది పనికొస్తే అది దానం చేయమని ప్రాధేయపడ్డాడు

సాధారణంగా రోడ్డు ప్రమాదం బారిన పడితే తనను ఎవరైనా రక్షించండంటూ ఆర్తనాదాలు చేస్తుంటారు. తన ప్రాణం పోతోందే, తనవాళ్లను వదిలి వెళ్లిపోవాల్సి వస్తుందే అని క్షణకాలం ఆలోచిస్తుంటారు. కానీ, బెంగళూరులో మాత్రం ఓ యువకుడు అలాంటి సమయంలో కూడా ఎవరూ చేయలేని పని చేశాడు. వేగంగా వచ్చిన లారీ తనను ఢీకొట్టి తన శరీరాన్ని రెండు ముక్కలుగా చేసి వెళ్లిపోతున్నా.. ఆ నొప్పితో కేకలు వేయడం మానేసి తన వద్దకు వచ్చిన బాటసారులతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన మనసులో మాట చెప్పాడు.

తాను ఎలాగూ బతికేది లేదని క్షణాల్లో గుర్తించి.. తన శరీరంలో ఏ అవయవం పనికొస్తే దాన్ని వెంటనే తీసుకొని అవసరం ఉన్నవారికి అమర్చాలని ప్రాధేయపడ్డాడు. ఇదే విషయం డాక్టర్లకు చెప్పాలని కోరాడు. అతడి కోరికను మన్నించి వైద్యులు అతడి ప్రాణాలు పోయిన క్షణాల్లో కళ్లను సేకరించి ఆస్పత్రిలో భద్రపరిచారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. హరీశ్ నంజప్ప (23) అనే యువకుడు తన స్వగ్రామం గొబ్బికి పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లాడు. తన ఓటు హక్కును వినియోగించుకొని బెంగళూరుకు తిరిగొస్తుండగా.. జాతీయ రహదారి పై ఉన్న తిప్పగొండనహళ్లి అనే గ్రామం వద్ద పంచాదార బస్తాలతో వస్తున్న ఓ లారీ.. పల్సర్ పై వెళుతున్న హరీశ్ ను ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఢీకొట్టింది. దీంతో అతడు లారీ టైర్ల కింద పడిపోయాడు. అలా పడిపోగానే అతడి దేహం రెండు ముక్కలుగా విడిపోవడంతోపాటు నడుము నుంచి కాళ్ల వరకు ఉన్న భాగాన్ని లారీ కొన్ని అడుగుల మేర ఈడ్చుకెళ్లింది. తలతో ఉన్న మొండెం భాగం మరోచోట పడిపోయింది. అతడు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల తలకు ఎలాంటి గాయాలు కాలేదు.

ప్రాణం పోతున్న ఆ కొద్ది ఘడియల్లోనే రోడ్డుపై వెళ్లేవారిని దగ్గరకు పిలిచి తన అవయవాల్లో ఏది పనికొస్తే అది దానం చేయాల్సిందిగా కోరాడు. ఈలోగా స్థానికులు రెండుగా విడిపోయిన అతడి శరీర భాగాలను ఓచోట చేర్చి ఆస్పత్రికి తరలించారు. కానీ కాసేపట్లోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటి ఘోర రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర బాధాకరమైన పరిస్థితుల మధ్య గడిపిన హరీశ్ కు క్షణాల్లో తన అవయవాలు దానం చేయాలన్న ఆలోచన రావడం నిజంగా ఆశ్చర్యకరం అని వైద్యులు చెబుతున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)