మీకు ఆధార్ కార్డు ఉందా? అయితే ఇది తప్పక చదవండి

మన దేశీయుల ఆధార్ కార్డ్ వివరాల్లో సమస్త సమాచారమూ ఉంటుంది. ఆ డేటాబేస్‌ని ఎవరైనా హ్యాక్ చేస్తే - దేశ ప్రజలందరి డిటైల్స్ వారికి తెలిసే అవకాశం లేదా? అన్నదే ఇక్కడ ప్రశ్న! అసలు మన దేశీయుల ఆధార్ డేటాబేస్ ఎంత సెక్యూర్డ్ గా ఉంది? ప్రొటెక్షన్ మెజర్స్ యూఎస్ కంటే గొప్పగా ఉన్నాయా? లేనప్పుడు - దేశ ప్రజల మొత్తం సమాచారాన్నీ కన్నూకాలూ వివరాలతో సహా - సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని ఒకచోట సేకరించి పెట్టడం, పైగా ఆధార్ తప్పని సరి అంటూ అందరినీ అందులోకి దింపజూడడం - అజ్ఞానం, తొందరపాటు కాదా? ఈ ప్రశ్నలకి సమాధానాలు ప్రతి పౌరుడికీ తెలియాలి. వాళ్లంతా ఓకే అని అంగీకరిస్తేనే ఆధార్ కార్డ్‌ని తప్పనిసరి చేయాలి.
ఆధార్ కార్డు కోసం మనమిచ్చిన సమాచారం భద్రంగానే ఉందా ?
ఆధార్ కార్డ్ విషయాని కొస్తే - ఇప్పటికీ ఆధార్ కార్డు వల్ల మన అందరి వ్యక్తిగత సమాచారాలకి ముప్పుందన్న విషయం గురించి నిపుణులంతా ఎప్పటినుంచో గోల పెడుతున్నారు. దేశ ప్రజల మొత్తం వేలిముద్రలు, ఐరిస్ వివరాల్లాంటి సెన్సిటివ్ సమాచారం టెక్నాలజీ పేరుతో ఎవరైనా గుప్పిట్లోకి తీసుకుంటే ఎంత ప్రమాదం! టెక్నికల్ గా తెలిసీ తెలియని నైపుణ్యం లేని వ్యక్తుల ఆధ్వర్యంలో ఇలాంటి సమాచారం, అందులోనూ ఇంత పెద్ద ఎత్తున సమాచారం ఉండడం భద్రతా పరంగా మంచిదికానే కాదు. కానీ ఆధార్ కార్డ్ వల్ల ఉత్పన్నం కాగల సమస్యల్ని - సామాన్య ప్రజలలోకి ఎవరూ గట్టిగా తీసుకువెళ్లలేకపోయారు. ఒకవేళ తీసుకు వెళ్లినా జనం అంత సీరియస్ గా తీసుకునే పరిస్థితీ లేదు. ఎందుకంటే - రేషన్ కార్డులాగే అది కూడా ఓ అవసరమైన కార్డు అనుకుంటున్నారే తప్ప - దాంట్లో సెక్యూరిటీ పరమైన సమస్యలు దాగి ఉన్నాయన్న విషయం సామాన్యులకి తెలియనే తెలియదు.
సాక్షాత్తు సుప్రీమ్ కోర్టు వరమిచ్చినా...
సుప్రీం కోర్టు ఎంతో ముందు చూపుతో ఆధార్ అవసరం లేదని చెప్పడం ఎంతో ఆనందకరమైన విషయం. అన్నిటికంటే సీరియస్ జోక్ ఏంటంటే - సాక్షాత్తూ సుప్రీం కోర్టు చెప్పినా - ఇటు ప్రభుత్వాలు గానీ సంస్థలు గానీ... ఈ విచక్షణ, అవగాహన లేకుండా ప్రతి పనికీ ఆధార్ కార్డే కావాలంటున్నాయి. ఇలా అన్నిటికీ ఆధార్ కార్డు కావాలని, ప్రతిదానికీ ఆధార్ ని లింక్ చేయాలనీ కోరుతుండడం, దాన్ని ఎవరూ ప్రశ్నించకపోవడం నిజంగా మన అజ్ఞానానికి నిదర్శనం ! దేశంలో ఏ సంస్థయినా, గవర్నమెంటయినా ఏ విషయంలోనైనా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని డిమాండ్ చేస్తే అది అజ్ఞానం మాత్రమే కాదు. కోర్టు ధిక్కారం కూడా! ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి.

Popular Posts

Latest Posts