ఎవరికైనా పనికొచ్చే పది సలహాలు...ఈ సలహాలు పాటిస్తే.. 20, 30 ఏళ్లు అదనంగా జీవించొచ్చు

Loading...
కొండమీద వెయ్యేళ్ళు పైబడ్డ చెట్లున్నాయేమో కానీ.. వందేళ్ళు పైబడ్డ మనుషులు అంతగా లేరు. మహా అయితే వందేళ్లు వచ్చేవరకూ బతుకుతారేమో... అదీ పదివేల మందిలో ఒకరు!. 40, 50, 60 అలా వయసు పెరిగేకొద్దీ దేనికి దగ్గరఅవుతున్నామో అన్న ఆందోళన మొదలయి పోతుంది. కొందరిలో అదలా పెరుగుతూనే ఉంటుంది. పోయేటప్పుడు ఎవరూ ఏదీ తీసుకుపోలేరని తెలుస్తూనే ఉన్నా... స్వార్థం, పొదుపరితనమూ ఎక్కువైపోతుంది ఎవరికైనా. భారతీయులకు ఇది మరీనూ. మనతో పోల్చుకుంటే చైనీయులు ఆ వయసులో కల్మషం లేని మనసుతో ఆరోగ్యంగా ఉంటారట. యాభై, అరవై ఏళ్ల తరువాత మరింత నిబ్బరంగా ఉండాలంటే ఈ కింది సలహాలు పాటించాలంటున్నారు చైనీయులు.

ఖర్చు చేయాల్సింది ఖర్చు చేయాలి కదా. అనుభవించాల్సింది అనుభవించాలి కదా. దానం చేయగలిగినపుడు దానం చేయొచ్చు కదా. పిల్లలు, పిల్లల పిల్లలు సంపాదించలేరన్నట్టు, వారికేదీ చేతకాదన్నట్టు, వారికోసం ఉన్నదంతా దాచిపెట్టీ, పోగేసీ, వారిని పరాన్న జీవుల్ని చేయడమెందుకు?

పోయాక ఏమవుతుందో అన్న ఆందోళనే అన్ని సమస్యలకు మూలం. మట్టిలో కలిసిపోయిన వారిని తిడుతున్నాం.. పొగుడుతున్నాం. వారికేమన్నా తెలుస్తుందా? మరెందుకంత ఆందో ళన? పిల్లలు వారి భవిష్యత్తు వారు చూసుకోగలరు. వారి మార్గాలేవో వారు ఎన్ను కోగలరు. వారిమీద అంత అపనమ్మకంతో వారికి బానిసలుగా తయారవడమెందుకు?

అలా అని పిల్లల దగ్గర నుంచి ఆశపడటం కూడా అంత అవసరమా? పిల్లల సంరక్షణ ఎంత చేస్తున్నా, చేయకపోయినా, వారి వారి పనుల్లో నిబద్ధతల్లో వారు నిమగ్నమై ఉంటారు. చేస్తున్నామన్న సంతృప్తికోసమో, చేయలేకపోతున్నా మన్న బాధో, అది ఎంత స్వయంకృతమో ఆలోచించుకుంటే ఎవరికి వారికి తెలిసిపోతుంది.

అంత చేస్తున్నా పట్టించుకోని పిల్లలు, ఆస్తులకోసం ఎంత తొందరగా పోతాం అని వేచి చూస్తుండొచ్చు, లేదా బతికుండగానే తమ ఆధీనం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తుండొచ్చు. ఒకటి మాత్రం నిజం, ఎవరు ఔనన్నా కాదన్నా, పిల్లలు వారి తల్లిదండ్రుల ఆస్తులకు వారసులు. కానీ పిల్లల ఆస్తులకు తల్లిదండ్రులు ఏమీకారు.

వయస్సు పెరిగేకొద్దీ ఆరోగ్యాన్ని సమతౌల్యం చేసుకోగలమా? ఆస్తులు పెంచుకునేందుకు ఆరోగ్యం పనికొచ్చినట్టు వయసు పెంచుకోవడానికి ఆస్తులు పనికొస్తాయా?... ఆరోగ్యం పాడవకుండా ఎంత సంపాదించాలి, ఎక్కడితో ఆపాలి అన్నది తెలుసుకోవడం ఎవరికైనా ముఖ్యమే.

వెయ్యెకరాల పంటభూమి ఉన్నా తినడానికి మహా అయితే అరకేజీ బియ్యం రోజుకు సరిపోతాయి. ఉన్న వెయ్యి భవనాల్లో హాయిగా రాత్రులు నిద్రపోయేందుకు ఎక్కువలో ఎక్కువ తొమ్మిది చదరపు గజాల చోటు చాలు. అంచేత - కావల్సినంత తిండి, కావల్సినంత డబ్బు, కావల్సినంత స్థలం ఉంటే చాలు కదా, హాయిగా బతకడానికి ఎవరికైనా.

ప్రతి కుటుంబంలోనూ ఏవో కొన్ని సమస్యలు ఉంటూనే ఉంటాయి. సమస్యలు లేనిదెవరికి? ప్రతిష్ఠతోను, సామాజిక అంతస్తుతోను, ఎవరి పిల్లలు బాగున్నారో ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ, ఎవరితోనో పోల్చుకుంటూ, ఎప్పటికప్పుడు లేనిపోని ఆందోళనెందుకు? ఆరోగ్యం పాడు చేసుకోవడమెందుకు? ఆనందంగా ఉండటంలోను, ఆరోగ్యం దీర్ఘాయువుగా ఉండటంలోనే ఎవరితోనైనా పోటీ పడగలగాలి ఎప్పుడైనా. మార్చలేని వాటికోసం, ఆధీనంలో లేని వాటికోసం ఆరాటమెందుకు? అనారోగ్యం పాలవడమెందుకు?

ఎవరి బాగోగులు, ఆనందాలు వారే చూసుకోవాలి. మనస్థితి బాగున్నంతసేపూ, ఆనందించే విషయాల్ని గుర్తు చేసుకుంటూ, రోజూ ఆనందం కలిగించే పనులు సరదాగా చేసుకుంటూ ఉంటే, ప్రతిరోజూ ఆనందంగా గడిచిపోతుంది. ఒక రోజు ఆనందంగా గడిచిపోతే మరొకరోజు అలానే గడిపేందుకు సిద్ధంగా ఉంటుంది. మంచి ఉత్సాహంతో ఉంటే అనారోగ్యం నయమవుతుంది. ఆనందోత్సాహంలో అది మరింత తొందరగా నయమవుతుంది. మంచి ఆనందం ఉత్సాహంలో అనారోగ్యం ఎప్పటికీ రాదు. మంచి ఉత్సాహంతో, సరిపడ వ్యాయామం చేసుకుంటూ, సూర్యరశ్మిని కావల్సినంత పొందుతూ, వైవిధ్యమైన తిండి తింటూ, కావల్సినంత విటమిన్‌ ఖనిజ పదార్థాల్ని తీసుకుంటూ కాలం గడిపితే ఆరోగ్యంతోపాటు మరో 20-30 ఏళ్ళు అదనపు జీవితం పొందొచ్చు.

పై అన్నింటి కంటే, చుట్టూ ఉండే ఆనందాన్ని అనుభవిస్తూ, స్నేహితులతో గడిపుతూ ఉంటే, వాళ్ళంతా మీకు వార్ధక్యాన్ని దరిచేరనీయరు. మీకు మీరుగా వయస్సుమీద పడ్డట్టుగా భావించరు. మీరు అందరికీ కావలసిన వారవుతారు. మీరూ ఆ జీవితంలో ఆనందాన్ని కోల్పోరు.
Loading...

Popular Posts