కుంకుమపువ్వుతో బిడ్డ రంగు మారుతుందా.. ముఖంలో మెరుపు వస్తుందా? అందరూ తెలుసుకోవాల్సిన విషయం

కుంకుమ పువ్వు వాడితే పిల్లలు మంచి రంగుతో పుడతారని గర్బిణీలకు పాలల్లో కలిపి ఇస్తుంటారు. పండంటి ఎర్రటి బిడ్డ పుడతాడని ప్రాచీన కాలం నుంచి వస్తున్న నమ్మకం. అయితే కుంకుమ పువ్వుని పరిమితంగా తీసుకుంటే దీనితో పోషకపరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని చిటికెడుకు మించకుండా తీసుకోవడం సురక్షితం. ఇందులో బీ-కాంప్లెక్స్ విటమిన్‌కు సంబంధించిన థయామిన్, రైబోఫ్లేవిన్ అన్న విలువైన పోషకాలు ఉన్నాయి. ఇవి గర్భవతుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక గర్భవతుల్లో ప్రోజెస్టెరాన్ అన్న హార్మోన్ కారణంగా మలబద్దకం రావడం చాలా సహజంగా జరుగుతుంటుంది. చాలా పరిమితమైన మోతాదులో తీసుకుంటే కుంకుమపువ్వు జీర్ణప్రక్రియను సాఫీగా జరిగేలా చేస్తుంది. ఆకలిని కూడా పెంచుతుంది. ఆ రకంగా ఇది గర్భవతులకు మేలు చేస్తుంది.

కుంకుమ పువ్వు వాడితే కడుపులోని బిడ్డ రంగును ఆకర్షణీయంగా మార్చుతుందనేది అపోహ మాత్రమేనట. దీనికి తగిన శాస్త్రీయ నిర్ధారణ లేదు. బిడ్డ ఒంటిరంగును తల్లిదండ్రుల జీన్స్ నిర్ణయిస్తాయి. తార్కికంగా ఆలోచించి చూస్తే పాలు సంపూర్ణాహారం. గర్భవతులకు చాలా మేలు చేస్తాయి. అయితే మొదటి మూడు నెలల పాటు గర్భవతులు వేవిళ్లు, వికారం కారణంగా పాలు తాగడానికి ఇష్టపడరు. కుంకుమపువ్వు అనే సుగంధద్రవ్యం పాలను మరింత రుచికరంగా, సుగంధభరితంగా చేస్తుంది. పైగా బిడ్డ మంచి రంగులో పుడతాడనే అంశం వాళ్లను పాలు తాగేలా ప్రోత్సహిస్తుంది. బహుశా బిడ్డ రంగు కోసం కుంకుమపువ్వు అనే సంప్రదాయం ఇందువల్లనే పుట్టింది. కొన్నిచోట్ల సంప్రదాయ వంటకాల్లోనూ దీన్ని ఒక దినుసుగా ఉపయోగించి వంటకు మరింత రుచిని తీసుకొస్తారు. అప్పుడు దీనివల్ల కలిగే పైన పేర్కొన్న ప్రయోజనాలన్నీ కేవలం గర్భవతులకే కాకుండా మిగతావాళ్లకూ చేకూరుతాయి. గర్భవతులు దీన్ని పాలలో చిటికెడు కంటే ఎక్కువగా వేసుకోకూడదు. ఎందుకంటే ఇది ఒక నేచురల్ హెర్బ్ కాబట్టి పరిమితికి మించినప్పుడు అది గర్భసంచిని ముడుచుకుపోయేలా చేసే అవకాశం ఉంది. మరీ ఎక్కువగా వాడితే గర్భస్రావమూ అయ్యే ప్రమాదం ఉంది.

Popular Posts

Latest Posts