బ్రిటిష్ వారిని భారత్ నుండి వెళ్ళగొట్టింది గాంధీ కాదు సుభాష్ చంద్రబోస్


నేతాజీ సుభాష్ చంద్రబోస్ కనబడకుండాపోయి డెబ్భయ్యేళ్ళు దాటినా భారత ప్రజలలో ఆయన ఆచూకీ గురించి, ఆయన అదృశ్యం వెనుక దాగి ఉన్న రహస్యాల గురించిన ఉత్కంఠ ఏమాత్రం చెక్కుచెదరకుండా అలానే ఉంది. ప్రపంచ చరిత్రలోనే ఇదొక అద్భుతమైన విషయం. భారత ప్రజలు నేతాజీని అంతగా ఎందుకు ఆరాదిస్తున్నారో తెలుసుకోవాలంటే అసలు ఆ మహావీరుడు దేశానికి చేసిన మహోన్నత సేవలను తెలుసుకోవాలి. నేతాజీకి సంబంధించి రహస్యంగా ఉండిపోయిన రికార్డులు, ధ్రువపత్రాల నుండి లభ్యమౌతున్న సమాచారాన్ని బట్టి ఆయన బ్రిటిష్ సామ్రాజ్యంపై ఎంత బలమైన దాడి చేసేరో తెలుస్తుంది. ఆ వివరాలన్నీ వెలుగు చూడకపోవడం నేతాజీకి, ఆయన సహచరులకు తీరని అవమానమే. స్వాతంత్ర్యోద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోషించిన పాత్ర నిరుపమానమైనది. 1947లో బ్రిటిష్ వారి నుండి అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ నాయకులు తమ రాజకీయ స్వార్థం కోసం నేతాజీని, ఆంగ్ల పాలకులపై ఆయన నడిపిన అద్భుత పోరాట విశేషాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసారు.

గమనించవలసిన విషయం ఏమిటంటే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమం ఉధృతంగా సాగలేదు. నేతాజీ మాత్రం రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఒక మహదవకాశంగా తీసుకున్నారు. ఇదే ఆఖరి అవకాశంగా ఒక్క ఆరు నెలలు ఉధృతంగా పోరాడినట్లయితే మనం స్వాతంత్ర్యం పొందగలమని కాంగ్రెస్ వారిని కోరారు. అయితే ప్రపంచ యుద్ధంలో తలమునకలుగా ఉన్న బ్రిటిష్ అధికారులపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు గాంధీగారి నాయకత్వంలోని కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేయలేదు.

కాంగ్రెస్ యొక్క వైఖరికి విసుగెత్తిపొయిన సుభాష్ చంద్రబోస్ దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆయన ఉద్దేశ్యం వివిధ దేశాలలో బ్రిటిష్ వారి తరఫున పోరాడుతున్న భారతీయ సైనికులను సమీకరించి, వారితో బ్రిటిష్ వారిపై యుద్ధం చేయడం. అలా సమీకరించిన భారతీయ సైనికులతో ఆయన "ఆజాద్ హింద్ ఫౌజ్" స్థాపించేరు. ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మాణంలో నేతాజీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్నారు. బ్రిటిష్ వారితో పోరాడటానికి సమర్థ సైనిక గణాన్ని తయారు చేసారు.

ఒక ప్రక్క బ్రిటిష్ సైన్యంతో తలబడడానికి ఆజాద్ హింద్ ఫౌజ్ సిద్ధమౌతున్న తరుణంలోనే గాంధీజీ 1942లో "క్విట్ ఇండియా" ఉద్యమానికి పిలుపునిచ్చారు. నిజానికి ఇలాంటి ఉద్యమం కోసం 1939లోనే నేతాజీ పట్టుబట్టారు. నిజానికి గాంధీగారి క్విట్ ఇండియా ఉద్యమం ఎంతో అవసరమైనదే అయినప్పటికీ మొదలుపెట్టిన మూడు వారాలలోనే ఆ ఉద్యమం అణగారిపోయింది. ఆ తరువాత కొన్ని నెలలకి దాని ఊసే మర్చిపోయేరు. భారత స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ అద్భుతాలే చేసారు. నిజానికి క్విట్ ఇండియా ఉద్యమం పలు ప్రాంతాలలో వ్యాపించాల్సి ఉంది. మరి ఏం జరిగింది? దీనికి సంబంధించి బాబాసాహెబ్ అంబేద్కర్ తర్కాన్ని విందాం.

బి.బి.సి.కి చెందిన ఫ్రాన్సిస్ వాట్సన్ కి 1955 ఫిబ్రవరిలో ఇంచ్చిన ఇంటర్వ్యూలో బ్రిటిష్ వారు 1947లో భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి గల కారణాలను వివరించారు అంబేద్కర్. "ఉన్నట్టుండి హఠాత్తుగా 1947లో బ్రిటిష్ వారి నుండి మనకు అధికార మార్పిడి ఎందుకు జరిగిందో తెలియదు. బ్రిటిష్ ప్రధాని మిష్టర్ ఆట్లీ భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చేందుకు అకస్మాత్తుగా ఎందుకు అంగీకరించేడో అర్థం కావటంలేదు. దీని వెనుకనున్న రహస్యం ఆయనకే తెలియాలి. బహుశా ఆయన రాయబోయే ఆత్మకథలో ఈ వివరాలు వెల్లడిస్తాడేమో?" అని అంబేద్కర్ అన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ మరణించడానికి రెండు నెలల ముందు, అంటే 1956 అక్టోబరులో క్లెమెంట్ ఆట్లీ ఒక రహస్య ప్రైవేటు ఉపన్యాసంలో అసలు విషయాన్ని బయటపెట్టాడు. వాటిని గ్రహించడానికి బాహ్య ప్రపంచానికి రెండు దశాబ్దాలకు పైనే సమయం పట్టింది.
"కాంగ్రెసు వారి క్విట్టిండియా పోరాటం కొన్నేళ్ళు కిందటే ముగిసిపోయింది. కనుచూపు మేరలో పోరాటాలూ లేవు. మీ పాలనకు వచ్చిన ఇబ్బందీ లేదు. మరి ఏదో ఉపద్రవం ముంచుకొస్తునట్టు మీరెందుకు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు? ఇంత హడావిడిగా దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చేయడానికి కారణం ఏమిటి?" అని అడిగితే 1947 నాటి బ్రిటిష్ ప్రధాని అట్లీ అనంతర కాలంలో ఇచ్చిన జవాబు ఇది: ‘‘అతి ముఖ్యకారణం ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రభావం.’’ ‘‘మరి గాంధీ ప్రభావం ఏమిలేదా?’’ అన్న ప్రశ్నకు ఆయన తడుముకోకుండా ‘‘చాలా తక్కువ’’ అని బదులిచ్చాడు!
సర్ ఆట్లీ వెల్లడించిన వివరాలు అంబేద్కర్ కి ఆశ్చర్యం కలిగించలేదు. ఇది ఆయన ముందే ఊహించారు. బి.బి.సి.కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన, "భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి లేబర్ పార్టీ నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులు రెండున్నాయి" అనిఅన్నారు.

అంబేద్కర్ ఇంకా ఇలా అంటారు: "దేశంలో ఏం జరిగినా, దేశంలోని నాయకులు ఎన్ని ఆందోళనలకు పిలుపునిచ్చినా సరే భారతదేశ సైన్యం మాత్రం తమ పట్ల విధేయతతోనే ఉంటుందని బ్రిటిష్ వారు గట్టి నమ్మకంతో ఉన్నారు. అలా ప్రచారం చేస్తూనే దేశంలో తమ పాలనను కొనసాగిస్తూ వచ్చేరు. కానీ ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా నేతాజీ చేబట్టిన సైనిక కార్యకలాపాలు బ్రిటిష్ వారు విశ్వాసాన్ని పటాపంచలు చేసింది. భారతీయ సైనికులందరూ ఒక పటాలంగా బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసారు.”

నేడు నేతాజీ మిస్టరీకి సంబంధించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మేజర్ జనరల్ జి.డి. బక్షి వెల్లడిస్తున్న వివరాలను పరిశీలిస్తే అంబేద్కర్ మాటలలోని వాస్తవం మనకు అవగతమౌతుంది.

లెఫ్టినెంట్ జనరల్ ఎస్.కె. సిన్హా జమ్మూ-కాశ్మీర్, అస్సాం రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేసారు. 1946లో ఢిల్లీలో డైరెక్టరేట్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ముగ్గురు అధికారులలో ఏకైక భారతీయుడు ఈయన. "ఆజాద్ హింద్ ఫౌజ్ పట్ల భారతీయ సైనికులలో గల సానుభూతి తక్కువదేమీ కాదు. 1857 సంగ్రామం లాంటిది మరొకటి జరగవచ్చునేమోనని 1946లో బ్రిటిష్ వారు భయపడ్డారు" అని 1976లో సిన్హా అభిప్రాయపడ్డారు.

ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ సర్ నార్మన్ స్మిత్ 1945లో సమర్పించిన ఒక రహస్య నివేదిక ఇలా పేర్కొంది: "ఆజాద్ హింద్ ఫౌజ్ కారణంగా ఉత్పన్నమౌతున్న పరిస్థితులు దేశంలో దేశంలో నెలకొన్న అశాంతిని గురించి హెచ్చరిస్తున్నాయి. భారత ప్రజలలోను, సైన్యంలోనూ ఆజాద్ హింద్ ఫౌజ్ పట్ల గల సానుభూతిని ఉపేక్షించడానికి వీల్లేదు."

భారత సైనికుల నుండి ఉత్పన్నం కాబోయే తిరుగుబాటు గురించి చర్చించడానికి బ్రిటిష్ ఎమ్.పి.లు ఆ దేశ ప్రధాని క్లెమెంట్ ఆట్లీని 1946 ఫిబ్రవరిలో కలిసారు. ఆట్లీని కలిసిన బ్రిటిష్ ఎమ్.పి.లు ఏమన్నారో తెలుసా? "ఇప్పుడు మనముందు రెండే మార్గాలున్నాయి. మొదటిది భారతదేశాన్ని వదలిపెట్టి వచ్చేయడం. రెండవది భారతీయుల మనల్ని వెళ్లగొట్టే వరకు వేచిచూడటం. రెండవ దాని గురించి ఆలోచిస్తే భారతీయ సైనికులలో మన పట్ల గల విధేయతను విశ్వసించడానికి వీల్లేని పరిస్థితి. ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు ఇప్పుడు భారత జాతికి ఆదర్శవీరులైనారు" అని.
బ్రిటిష్ వారితో చేసిన యుద్ధాలలో ఓడిపోయినప్పటికీ భారత్ లో ఆంగ్లేయుల పాలనకు గట్టి దెబ్బే కొట్టారు నేతాజీ. దురదృష్టవశాత్తూ భారతదేశానికి నేతాజీ అత్యవసరమైన సమయంలో ఆయన అదృశ్యమైపోయారు.

మన ముందుతరాల వారి కంటే మనకే నేతాజీ అదృశ్యం వెనుక దాగినవిషయాలు ఎక్కువగా తెలుస్తున్నాయి. మనం నేడు ఇష్టారాజ్యంగా అనుభవిస్తున్న స్వాతంత్య్రం ప్రధానంగా నేతాజీ శౌర్యఫలం. నేతలెందరున్నా నేతాజీ ఒక్కడే! జయంతులే తప్ప వర్థంతులు లేనిఆ మహానీయునకు మనమే ఎంతో ఋణపడి ఉన్నాం.మన జాతికి, మనదేశాన్నేలే పాలకులకు కృతజ్ఞత అనేది ఉంటే నిత్యం స్మరించి, పూజించవలసింది ఆయననే.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)