పేదలకు కంటి చూపును ప్రసాదిస్తున్న ఆసుపత్రి

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. కంటిచూపు లేకపోతే ప్రపంచమంతా శూన్యంగానే అనిపిస్తుంది. కంటిచూపు ప్రాధాన్యాన్ని గుర్తించిన శంకర ఐ ఫౌండేషన్ వారు , ఒకటిన్నర దశాబ్దం క్రితం…శంకర సేవల్ని తెలుగుగడ్డకు విస్తరించాలని నిర్ణయించారు.

దీనికి స్పందిస్తూ జనచైతన్య సంస్థ గుంటూరు-విజయవాడ మార్గంలో నాలుగున్నర ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దేశవిదేశాల్లోని దాతల సౌజన్యంతో భవన నిర్మాణానికి నిధులు సమకూరాయి.

2004 మార్చిలో గుంటూరులో ఆసుపత్రి ప్రారంభమైంది. ప్రపంచశ్రేణి నేత్రవైద్య సాంకేతిక పరిజ్ఞానం ఇక్కడ అందుబాటులో ఉంది. అపార అనుభవం ఉన్న వైద్యబృందం అండగా నిలిచింది. నేత్ర సేవలు క్రమంగా కృష్ణా, ప్రకాశం జిల్లాలకూ విస్తరించాయి. ‘గిఫ్ట్‌ ఆఫ్‌ విజన్‌’ కార్యక్రమం కింద వైద్యులు ఈ మూడు జిల్లాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని గుంటూరు ఆసుపత్రికి తీసుకువస్తారు.

సోమవారం నుంచి శుక్రవారం వరకూ…రోజుకు 60 నుంచి 100 దాకా శస్త్రచికిత్సలు చేస్తారు. ఇక్కడ మొత్తం 225 పడకలు ఉన్నాయి. వీటిలో ఇరవై దాకా ఫీజులు చెల్లించేవారికి కేటాయిస్తారు. పడకల సామర్థ్యాన్ని మరో వందకు పెంచే ప్రయత్నం జరుగుతోంది. ఈ ఆవరణలో ఏటా పాతిక వేల ఉచిత శస్త్రచికిత్సలు జరుగుతాయి.

కోయంబత్తూరు తర్వాత అతిపెద్ద ఆసుపత్రి ఇదే. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి ఎన్టీఆర్‌ వైద్య సేవ కిందా, వివిధ ప్రైవేటు కంపెనీల ఉద్యోగులకు ఆరోగ్య బీమా పథకాల కిందా ఇక్కడ వైద్యం చేస్తున్నారు. ఉచిత నేత్ర చికిత్స కోసం వచ్చేవారు ముందుగా ఆయా ప్రాంతాల్లో జరిగే వైద్య శిబిరాలకు హాజరు కావాల్సి ఉంటుంది. నేరుగా ప్రవేశం ఉండదు. శంకర కంటి ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఓ ఐ బ్యాంక్‌ ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ‘ఆదర్శ నేత్రనిధి’గా గుర్తించింది.

Address:

Vijayawada-Guntur Expressway,

Pedakakani, Guntur,

Andhra Pradesh 522509

Phone:0863 229 3903
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)