తల్లిదండ్రుల ముందు మద్యం సేవించిన యువతి.. ఆపై

ఎంత మోడ్రన్‌గా ఉన్నా.. ఆధునికంగా ఆలోచించినప్పటికి కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఇండియన్‌ పేరెంట్స్‌ మార్పు అంగీకరించరు. ముఖ్యంగా ఆడపిల్లలు మద్యం సేవించే విషయాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేరు. మద్యపానం మగవారికి మాత్రమే అని ఏళ్లుగా నమ్ముతున్న సమాజం మనది. అయితే ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్‌ మారుతన్నప్పటికి నేటికి మన సమాజంలో నూటికి 95 శాతం కుటుంబాల్లో ఆడవారు తాగకూడదు అనే నియమం చాలా కఠినంగా పాటిస్తారు. ఒక వేళ అందుకు భిన్నంగా జరిగితే తల్లిదండ్రుల రియాక్షన్‌ ఇలా ఉంటుందంటన్నారు మిషా మాలిక్‌. కొలంబియాలో నివసిస్తున్న మిషా మాలిక్‌ రెండు రోజుల క్రితం తన ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. దీనిలో మిషా తన తల్లిదండ్రుల ఎదురుగా మద్యం సేవిస్తూంటుంది. మరో వైపు మిషా తల్లి.. కూతుర్ని తాగవద్దని బతిమిలాడటం వినిపిస్తుంది. ‘ఇది జరిగాక మా అమ్మానాన్నలు నన్ను ఇండియా తిరిగి పంపిచడానికి టికెట్లు బుక్‌ చేశారు’ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. ‘ఇండియన్‌ పేరెంట్స్‌ అంటేనే ఓవర్‌ కేరింగ్‌ అని నిరూపించుకున్నారం’టూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు.

రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో తండ్రి కూతురు మృతిచెందిన విషాద సంఘటన షాద్‌నగర్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుచ్చిగూడ గ్రామానికి చెందిన బూత్కు చెన్నయ్య (45), కూతురు సంగీత(24) వ్యక్తిగత అవసరాల నిమిత్తం బైక్‌పై షాద్‌నగర్ వెళ్ళి తిరిగివస్తున్న క్రమంలో ఎర్టికా కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఇద్దరూ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. తండ్రీ కూతురు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో షాద్‌నగర్ పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంతోషకర జీవితాల్లో రోడ్డు ప్రమాదం చీకటిని నింపడంతో గ్రామంలో ప్రతి ఒక్కరు కన్నీరుమున్నీరయ్యారు. కళ్ల ముందు బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చే క్రమంలో ఇంతటి ఘోరం జరగడం పట్ల గ్రామస్తులు దిగ్భ్రాందిని వ్యక్తం చేస్తున్నారు. ఫరుక్‌నగర్ మండల పరిధిలో గత కొన్ని రోజులుగా వరుసరోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం పట్ల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు మితిమీరిన వేగంతో వస్తుండటంతో ప్రజలు భయందోళనలకు గురవ్వాల్సిన పరిస్థితి ఉన్నదని వేగ నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోకపోతే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉన్నదని ప్రజానీకం ఆరోపిస్తున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయ్ కుమార్ తెలిపారు.

పది’ పరీక్షలకు వెళ్తుండగా..
చేవెళ్ల రూరల్ : రోడ్డు ప్రమాదంలో కన్నతండ్రి చనిపోయిన దుఃఖంలో కొడుకు 10వ తరగతి పరీక్ష రాసిన సంఘటన మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభు ్యలు తెలిపిన వివరాల ప్రకారం మల్కాపూర్ గ్రామానికి చెందిన రహీమోద్దీన్(45) కొడుకు ఎండి అమీర్‌కు బుధవారం పదవ తరగతి ఇంగ్లీష్ పరీక్ష ఉండటంతో ఉదయం 7:45గంటలకు ఇంట్లో నుంచి మోటార్ సైకిల్‌పై బయలుదేరారు. ఉదయం 8గంటల సమయంలో మల్కాపూర్ స్టేజీ దగ్గర మెయిన్ రోడ్డు నుంచి చేవెళ్లవైపు వస్తుండగా సుజాత స్కూల్ బస్సు(టీఎస్07 యూసీ1985) అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై ఉన్న రహీమోద్దీన్ రోడ్డుపై పడా ్డడు. బస్సు అతని ఎడమచేతిపై వెళ్లడంతో పాటు తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కొడుకు ఎండీ అమీర్‌కు కుడి కాలు, ఎడమ చేతి, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. అమీర్‌కు పదవ తరగతి ఇంగ్లీష్ పరీక్ష ఉం డటంతో తండ్రి చనిపోయిన దుఃఖంలో కూడా పరీక్ష రాసేందుకు వెళ్లాడు. తండ్రి చనిపోవడంతో కుటుంబ సభ్యులు, కొడుకు రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. బస్సు డ్రైవర్ నిర్లక్షంగా నడపడంతో రోడ్డు ప్రమాదం జరిగిందని అక్కడున్న స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ముద్దుల విషయంలో అలాంటి హద్దులేమీ లేవంటున్న సమంత

పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతుంది సమంత అక్కినేని. ఇదిలా ఉంటే తాజాగా మజిలీ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సమంతను ఒక విచిత్రమైన ప్రశ్న అడిగారు జర్నలిస్టులు.ఈ సినిమాలో మిమ్మల్ని కాకుండా నాగచైతన్య మరో హీరోయిన్ ను ముద్దు పెట్టుకున్నాడు కదా.. మీకు అసలు కోపం రాలేదా.. అయినా పెళ్లి తర్వాత ఇలాంటి ముద్దు సీన్లు చేయడం కూడా మీకు ఓకేనా అని వాళ్లు అడిగారు. దీనికి వెంటనే చాలా కూల్ గా సమాధానం ఇచ్చింది సమంత అక్కినేని. మేము ఉన్నది నటించడం అనే ప్రొఫెషన్లో.. కాబట్టి అందులో అన్నీ ఉంటాయి. దాన్ని మీరు ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నారు అంటూ కౌంటర్ ఇచ్చిన సమంత.

అక్కడ కౌగిలించుకున్నా.. ముద్దు పెట్టుకున్నా అవన్నీ కేవలం నటనలో భాగమే. ఎవరూ కావాలని చేయరు.. సీన్ డిమాండ్ చేసినప్పుడు ముద్దు పెట్టుకోవడంలో తప్పు లేదు అంటుంది సమంత అక్కినేని. పైగా రంగస్థలంలో తాను చరణ్ బుగ్గలపై మాత్రమే ముద్దు పెట్టానని.. అది సుకుమార్ కెమెరా ట్రిక్ చేసి పెదాలపై ముద్దు పెట్టినట్లు చూపించాడని చెప్పింది సమంత. వ్యక్తిగతంగా తాను ముద్దు సీన్లకు వ్యతిరేకం కాదని.. సీన్ డిమాండ్ చేసినప్పుడు మాటల్లో చెప్పలేని ఎన్నో ఎమోషన్స్ ముద్దులో చూపించొచ్చు అంటోంది ఈ ముద్దుగుమ్మ. నటించడంలో భాగంగా వచ్చే వీటి గురించి పెద్దగా పట్టించుకోనని అంటోంది సమంత. అయితే ఇవే సూత్రాలు నాగచైతన్యకే కాదు తనకు కూడా వర్తిస్తాయని చివర్లో చిన్న కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అంటే భవిష్యత్తులో తాను ముద్దు సీన్ లో నటిస్తే అది కేవలం నటనలో భాగంగానే చైతూ కూడా తీసుకుంటాడు.. ఎందుకంటే తామిద్దరం మంచి స్నేహితులం.. అంతకు మించి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటాం అని చెబుతోంది ఈ అక్కినేని కోడలు. తమకు లేని సమస్య ఇంకెవరికి ఉండాల్సిన అవసరం లేదు. అందుకే అభిమానులకు కూడా క్లారిటీ ఇస్తున్నానని చెప్పింది సమంత. ఏప్రిల్ 5న మజిలీ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

తక్కువ ధరలో ఎక్కువ ఉతుకు : MI వాషింగ్ మెషీన్స్ వస్తున్నాయి

ఫోన్ల ప్రపంచంలో సంచలనం.. ఎంఐ వచ్చిన తర్వాత మొబైల్ మార్కెట్ స్వరూపమే మారిపోయింది. మొన్నటికి మొన్నే.. టీవీలు రిలీజ్ చేసి.. ఇండియన్ టెలివిజన్ మార్కెట్ ను షేక్ చేశారు. ఇప్పుడు అదేబాటలో వాషింగ్ మెషీన్స్ రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే చైనాలో మార్కెట్ లో దుమ్మురేపుతున్న ఈ సేల్స్.. అతి త్వరలోనే ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. షియోమీ (MI) వాషింగ్ మెషీన్స్ ధర కూడా చౌక అంటున్నారు. ఇండియన్ కరెన్సీలో తక్కువలో తక్కువగా 9వేల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. హై ఎండ్ ధర రూ. 22వేల వరకు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.

8కేజీల కెపాసిటీ ఉన్న వాషింగ్ మెషీన్ ధర రూ.9వేలుగా ఉంది. 9 రకాల ఆప్షన్స్ ఇచ్చారు. డబుల్ బ్లాక్ డిజైన్, స్ట్రాంగ్ వాటర్ బ్రో, ఎలాంటి మరక అయినా తొలగిస్తోంది. దుస్తుల రకాలను బట్టి వాషింగ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు. తక్కువ నీళ్లతో ఎక్కువ ఉతుకు, ఆటోమేటిక్ డ్రై ఉందని ఘనంగా ప్రచారం చేస్తోంది కంపెనీ. 9వేల రూపాయల స్టార్టింగ్ ధరతోనే.. ఇన్ని ఆప్షన్స్ ఇచ్చిన ఎంఐ.. హైఎండ్ తో మాత్రం పెద్దపెద్ద కంపెనీలకు ధీటుగా ఇస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో లభించే వాషింగ్ మెషీన్స్ తో పోల్చితే ధర చాలా తక్కువగా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు.

బాలీవుడ్ ఫిదా: నిన్న నటుడు.. నేడు వాచ్ మన్

బాలీవుడ్ హిట్ సినిమాల్లో నటించిన ఓ నటుడు.. ఇపుడు ముంబైనగరం పరేల్ లో ఓ బిల్డింగ్ దగ్గర సెక్యూరిటీగార్డ్ గా పనిచేస్తున్నాడు. అతడి పేరు సవీ సిద్దు. బ్లాక్ ఫ్రైడే, గులాల్, పటియాలా హౌజ్ లాంటి సినిమాల్లో నటించాడు. అవకాశాలు లేక… కుటుంబాన్ని పోషించే బాధ్యతతో… ఇలా వాచ్ మన్ గా పనిచేస్తున్నాడు.ఆర్థిక ఇబ్బందులతో సవీ సిద్దు వాచ్ మన్ గా పనిచేస్తున్నాడంటూ రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతడికి సానుభూతితోపాటు… మద్దతు కూడా పెరుగుతోంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఏంటో సవీ సిద్దు చూపించాడంటూ మద్దతుగా నిలుస్తున్నారు బాలీవుడ్ సెలబ్రిటీలు.

డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, హీరో రాజ్ కుమార్ రావు తాజాగా సవీసిద్దుకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఐతే… సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో… సవీ సిద్ధు తన కుటుంబాన్ని పోషించడానికి ఎంచుకున్న మార్గాన్ని మెచ్చుకుంటూ అతడికి గౌరవం ఇస్తున్నారు. “సినిమా ఫీల్డ్ లో గొప్ప జీవితం అనుభవించిన వాళ్లు.. కొన్ని సందర్భాల్లో అంతా కోల్పోతారని.. అప్పుడు ధైర్యం లేని వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటారు.. మద్యానికి బానిస అవుతుంటారు… కానీ.. సవీ సిద్దు వాచ్ మన్ గా పనిచేయడానికి వెనుకాడలేదు. అతడు ఇపుడు చేస్తున్న జాబ్ చిన్నదేం కాదు. డిగ్నిటీ, హుందూతనంతో బతకడాన్ని సవీ ఎంచుకున్నాడు. నటుడు అన్న గర్వం అతనిలో లేదు. అందుకు అతన్ని చూసి మనం గర్వపడాలి. గొప్పపేరు తెచ్చుకున్న చాలామంది ప్రముఖులు… ఒకప్పుడు ఖాళీగా తిరిగినవారు, హోటల్ లో వెయిటర్ గా పనిచేసినవారు, భేల్ పూరీ అమ్మినవాళ్లు ఉన్నారు” అని అనురాగ్ కశ్యప్ చెప్పారు. సవీసిద్ధు స్టోరీ చూస్తే ఎంతో స్ఫూర్తి కలుగుతోందని యాక్టర్ రాజ్ కుమార్ రావు అన్నారు. “సినిమాల్లో మీరు చేసిన పాత్రలు, మీ వర్కింగ్ నేచర్ , పాజిటివిటీని ప్రశంసిస్తున్నాం. నేను, నా సహచర నటులు మీకు అండగా ఉంటాం. పట్టుదల ఉంటే అవాంతరాలను అధిగమించగలం” అని రాజ్ కుమార్ రావు ట్వీట్ చేశారు.

కూతురిని కారులో వదిలి ఆఫీసర్‌తో సెక్స్.. తిరిగి వచ్చేసరికి చిన్నారి మృతి

ఓ మహిళా పోలీస్ అధికారి సెక్స్ మైకంలో పడి మూడేళ్ల కుమార్తెను బలి తీసుకుంది. అమెరికాలోని మిస్సిస్సిప్పిలో పోలీస్ అధికారిగా పనిచేస్తున్న కాసీ బార్కర్ (29) తన మూడేళ్ల కుమార్తెను పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో వదిలి తన సూపర్‌వైజర్ ఇంటికి వెళ్లింది. అతడితో సెక్స్ చేసి నిద్రలోకి జారుకుంది. 4 గంటల తర్వాత తిరిగి వెళ్లి వాహనంలో చూస్తే ఆమె కుమార్తె చనిపోయి ఉంది. ఏసీ పనిచేయకపోవడంతో కారు లోపల ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. దీంతో ఆ చిన్నారి ఉక్కిరిబిక్కిరై మరణించింది. వైద్య పరీక్షల్లో చిన్నారి మరణించేప్పుడు శరీరం 107 డిగ్రీలకు చేరినట్లు గుర్తించారు. ఈ ఘటన తర్వాత ఆమెను విధుల నుంచి తొలగించి, కేసు నమోదు చేశారు.

సెప్టెంబరు 30, 2016న చోటుచేసుకున్న ఈ ఘటనపై అమెరికా కోర్టు సోమవారం (మార్చి 18)న విచారణ జరిపింది. ఈ సందర్భంగా గత మూడేళ్లుగా గోప్యంగా ఉంచిన వాస్తవాన్ని ఆమె కోర్టుకు వివరించింది. ఆ రోజు తాను సుపర్‌వైజర్ కోరిక తీర్చేందుకు తన కుమార్తెను కారులో వదిలి.. అతని ఇంటికి వెళ్లానని, తిరిగి వచ్చేసరికి తన కుమార్తె చనిపోయి ఉందని తెలిపింది. నేరాన్ని అంగీకరించడంతో కోర్టు ఆమెకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సూపర్‌వైజర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బార్కర్ తన కుమార్తెను కారులో వదిలిపెట్టి వెళ్లడం ఇదే తొలిసారి కాదు.. ఈ ఘటనకు కొద్ది రోజుల ముందు గల్ఫ్‌పోర్టులోని ఓ స్టోర్‌‌కు వెళ్లేందుకు కుమార్తెను కారులో వదిలింది. కారులో ఒంటరిగా ఉన్న చిన్నారిని చూసి ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె పోలీసు డిపార్ట్‌మెంట్ ఆమెను వారం రోజులుపాటు సస్పెండ్ చేసింది. అయినా ఆమెలో మార్పు రాలేదు. మళ్లీ అదే తప్పు చేసి తన చిన్నారిని బలి తీసుకుంది.

చూస్తున్నారుగా.. అందరికీ ఇదే శిక్ష పడుతుంది!

జకార్తా : ఒకరి చేతులు మరొకరు పట్టుకుని నడిచిన ముస్లిం అవివాహిత యువతీ యువకులకు చేదు అనుభవం ఎదురైంది. పెళ్లి కాకుండా నీతి మాలిన చర్యకు పాల్పడి షరియా చట్టాలను ఉల్లంఘించారంటూ.. వారికి జైలు శిక్ష విధించడంతో పాటు కొరడా దెబ్బలు తినాల్సిందిగా మతాధికారులు ఆదేశించారు. ఇండోనేషియాలోని అకే ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమత్రా ఐలాండ్‌లోని ఇస్లాం చట్టప్రకారం గ్యాంబ్లింగ్‌, మద్యం సేవించడం, స్వలింగ సంపర్కం వంటి చర్యలను తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఎవరైనా అలా ప్రవర్తించినట్లైతే వారికి కఠిన శిక్షలు అమలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఐదు యువజంటలు విపరీత చేష్టలకు పాల్పడ్డారంటూ మత పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తప్పు చేసినందుకు ప్రాయశ్చిత్తం అనుభవించాలంటూ 22 కొరడా దెబ్బలు విధించారు. ఈ క్రమంలో షరియా అధికారి మాట్లాడుతూ.. ‘ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అందరూ జాగ్రత్తగా ఉండాలి. లేనట్లైతే ఇలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని శిక్ష అమలు చేస్తున్న సమయంలో చూస్తున్న చిన్నారులు, పెద్దలను హెచ్చరించారు. కాగా ఇలాంటి క్రూర చర్యలకు తీవ్రమైన నేరంగా పరిగణించాలని వామపక్షాలు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ఇది మతంతో ముడిపడిన సున్నిత అంశం కావడంతో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో పేర్కొన్నారు.

వైరల్‌ వీడియో : ఒకేచోట 45 రాటిల్‌ స్నేక్స్‌

ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన పాముల్లో రాటిల్ స్నేక్‌ ఒకటి. దాన్ని చూడగానే గుండె గుభేలుమంటుంది. అలాంటిది ఒకటి కాదు, రెండు ఏకంగా 45 రాటిల్‌ స్నేక్స్‌ను ఒకే చోట చూస్తే.. ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ధైర్యం లేని వారైతే హార్ట్‌ ఎటాక్‌ వచ్చి పోయినా పోతారు. కానీ సదరు ఇంటి యజమాని మాత్రం ముందు భయపడ్డా.. ఆ తర్వాత తేరుకుని పాములు పట్టే కంపెనీకి సమాచారం అందించాడు. వారు వచ్చి ఆ పాములను జాగ్రత్తగా సురక్షితమైన చోటుకు చేర్చారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగింది సంఘటన. పేరు వెల్లడించడానికి ఇష్టపడని సదరు ఇంటి యజమాని మాట్లాడుతూ.. ‘మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇంటికి వచ్చాను. బయట కేబుల్‌ మీద ఓ చిన్న రాటిల్‌ స్నేక్‌ కనిపించింది. దాంతో అక్కడకు వెళ్లి చూడగా దాదాపు 45 వరకూ రాటిల్‌ స్నేక్‌లున్నాయి. ఒక్కసారిగా అన్ని పాములను చూడ్డంతో చాలా భయమేసింది. కానీ ఎలాగొలా ధైర్యం కూడగట్టుకుని పాములు పట్టే సంస్థకు సమాచారం అందించాన’ని తెలిపారు. అంతేకాక దీనికి సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో అప్లోడ్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ‘మీ ఇంటిని తగలబెట్టండి.. మీరు చాలా ధైర్యవంతులు.. ఇది చూసి చాలా ఆందోళనకు గురయ్యాం’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు.

సముద్రం ముందు నిలబడి ఫోటోకు పోజిచ్చిన‌ యువతి.. భారీ అలలు వచ్చి.. వీడియో

సముద్రం చాలా డేంజర్. మనం ఏం చేసినా సముద్రం ముందు నిలబడే. అది కూడా జాగ్రత్తగా గమనించాలి. ఒక్కోసారి భారీ అలలు వచ్చి సముద్రం బయట ఉన్నవాళ్లను కూడా లోపలికి లాక్కెళ్తాయి. అందుకే సముద్రం దగ్గరికి వెళ్లినప్పుడు కాస్త ఆలోచించాలి. అక్కడ ఆవేశపడితే ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి ఘటనే ఒకటి ఇండోనేషియాలోని నుసా లెంబోన్గాన్ అనే ఐలాండ్‌లో ఉన్న డెవిల్స్ టియర్ వద్ద చోటు చేసుకున్నది. ఓ యువతి సముద్ర పక్కన ఉన్న కొండ మీదికి వెళ్లి ఫోటోకు పోజిచ్చింది. ఇంతలోనే రాకాసి అల వచ్చి తనను ఢీకొట్టింది. దీంతో ఆ యువతి అమాంతం ఎగిరి పడిపోయింది. భారీ అలలకు ఆ యువతి ఎక్కడ పడిపోయిందా అని అంతా ఒకేసారి అరిచారు. అయితే.. ఆ యవతి చిన్న గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. డెవిల్స్ టియర్ అనేది ఇండోనేషియాలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్. చాలామంది టూరిస్టులు అక్కడికి రోజూ వస్తుంటారు. అక్కడి అందాలను తమ కెమెరాల్లో బంధిస్తుంటారు. ఫోటోలకు పోజులిస్తుంటారు. అయితే.. భారీ అలలు వచ్చినప్పుడు మాత్రం టూరిస్టులు ఆ అలలకు దూరంగా పరిగెడతారు. ఈ యువతి భారీ అలను గమనించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

బైక్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు యువకులు మృతి

హైదరాబాద్ : వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గుర్రంగూడ గేటు సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీఎన్‌ రెడ్డి నగర్ నుంచి గుర్రంగూడ గేటు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులు వంశీ(20), సాయి(20) గుర్రంగూడకు చెందిన విద్యార్థులు కాగా.. వనస్థలిపురానికి చెందిన గణేష్(21) అనే మరో యువకుడు ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)